పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న తాపత్రయంతోనే ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని(Indiramma Housing Scheme) ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని చెప్పారు. ఈ యాప్‌ను గురువారం సీఎం రేవంత్(Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజల ఆత్మగౌరవంగా భావిస్తారని చెప్పారు.
దీనిని ఇందిరా గాంధీ ఆనాడే పసిగట్టారని, అందుకే ఇళ్లు, భూ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారని చెప్పుకొచ్చారు. రోటీ, కపడా, మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని తెలిపారు. దేశంలో గుడి లేని ఊరైనా కనిపిస్తుందేమో కానీ, ఇందిరమ్మ కాలనీ లేని ఊరు మాత్రం ఉండదు అని వ్యాఖ్యానించారు.
రూ.10వేలతో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకుందని, ఇంటి నిర్మాణం కోసం ప్రతి పేదోడికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు అందించామని సీఎం తెలిపారు.
‘‘ఈ సంవత్సర కాలంలో అందరి సహకారంతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. పేదవారు ఆత్మ గౌరవంతో బతకాలి. ఆనాడే ఈ విషయాన్ని ఇందిరా గాంధీ గుర్తించారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. తద్వారా పేదవారికి భూ పంపిణీ ద్వారా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈరోజు ఏ గ్రామంలో చూసినా దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఉన్నాయి.
లబ్ధిదారుల ఎంపికను AI సాయం ద్వారా నిజమైన అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటి నిర్మాణంలో ఎలాంటి డిజైన్ల షరతులు లేవు. లబ్ధిదారుల వారికి అనుకూలంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. మొదటి సంవత్సరం 4 లక్షల 59వేల ఇళ్లు నిర్మించనున్నాం. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు అనుమతుల మంజూరు చేశఆం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు.
మేము ఇల్లు కట్టి ఇస్తాము.. మీరు పెళ్ళిళ్లు చేయండి. గిరిజనులు, పారిశుధ్య కార్మికులు, అత్యంత పేదవారికి ప్రాధాన్యం ఇస్తాం. పైరవీలకు తావులేకుండా అర్హుల ఎంపిక. ఐటీడీఏ ఆదివాసీల ప్రాంతాలకు అదనంగా ఇళ్ళు మంజూరు చేస్తాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న కానుకే ఈ ఇందిరమ్మ ఇల్లు అన్నారు.