Revanth Reddy – Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చర్చలు వాడివేడిగా జరిగాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పలు కీలక అంశాలపై ఘాటు మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరిట రూ.700 కోట్ల అవినీతి జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు.. బీఆర్ఎస్ చేసిన అవినీతి లెక్కలను అంధకారంలో ఉంచుతున్నారంటూ చురకలంటించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ హరీష్ రావుకు రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు.
‘‘పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. కేసీఆర్(KCR) పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారు. కానీ జిల్లాకు సాగునీరు మాత్రం ఇవ్వలేదు. ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారు. వీటన్నింటినపై విచారణకు సిద్ధమా? సభ్యులు తప్పులు మాట్లాడితే సరిచేసే బాధ్యత నాకుంది. సభలో అబద్దాలు మాట్లాడటం సరైన పద్దతికాదు. 2018 డిసెంబర్‌లోపే మీటర్లు బిగిస్తామని కేంద్రానికి చెప్పిన కేసీఆర్.. పూర్తి చేశారా. మాట్లాడే ముందు హరీష్ రావు అధికారిక లెక్కలు చూడాలి’’ అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు.