తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణను దోచుకోవడమే పనిగా పాలన కొనసాగించారని ఆరోపించారు. శుక్రవారం మెదక్‌లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. ప్రపంచమంతా ఎరువుల ధరలు పెరిగినా మన దేశంలో మాత్రం పెరగలేదని, అందుకు బీజేపీ ప్రభుత్వమే కారణమని అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ(PM Modi) హాయంలో తెలంగాణకు పసుపు బోర్డు(Turmeric Board) వచ్చిందని, మరెన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు వచ్చాయని, కానీ అవి ఇక్కడ అమలు కావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో కూడా అమలు కావాలంటే ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ మెడలు వంచిన విధంగానే ఇప్పుడు రేవంత్ మెడలు కూడా వంచుతామని, తెలంగాణలో కూడా కమలం జెండాను ఎగరవేస్తామని అన్నారు.
గతంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే ఇప్పుడు సోనియాగాంధీ(Sonia Gandhi) కుటుంబం లూటీ చేస్తుందని విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే తెలంగాణను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంటూ చురకలంటించారు. రాహుల్(Rahul Gandhi), రేవంత్.. ట్యాక్స్‌ల పేరుతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. అప్పుడు కేసీఆర్(KCR) కుటుంబం, ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని, ఇక్కడ దోచుకునే కుటుంబాలు మారాయి తప్పితే రాష్ట్ర ప్రజల బతుకులు మారలేదని అన్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి అమ్మేస్తారని, ఇచ్చిన హామీలను అమలు చేయడం అనేది కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే లేదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం బియ్యం ఇస్తుంటే ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడానికి కేసీఆర్‌కు మనసు రాలేదని, ఇప్పుడు రేవంత్ కూడా రేషన్ కార్డులంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే.. అమలు చేసే ఆలోచనలో లేరని అన్నారు కిషన్ రెడ్డి(Kishan Reddy).