కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి అసెంబ్లీ సమావేశాలు జరిపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన దుర్మార్గుడు కేసీఆర్(KCR) అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలూచీలో కేసీఆర్‌ను మించినవారు ఈ దేశంలో మరొకరు పుట్టరని అభిప్రాయపడ్డారు.
2014కు పూర్వం తాము ఏం మాట్లాడినా తెలంగాణ కోసమే మాట్లాడామని గుర్తుచేశారు. నన్ను తెలంగాణ వ్యతిరేకి అంటే తెలంగాణ సమాజం నమ్మదని అన్నారు. ఏ రోకటి కాడ ఆ పాట పాడే వ్యక్తి కేసీఆర్ ఎద్దేవా చేశారు. గద్దర్(Gaddar) చివరి కోరిక, ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆయన స్ఫూర్తిని మేం కొనసాగిస్తామని తెలిపారు. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న నాతో చెప్పారని అన్నారు.
యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని నాకు సూచించారని గుర్తుచేశారు. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన అప్పుడే చెప్పారని వెల్లడించారు. గద్దర్ మరణించారని ఇప్పటివరకు నేను సంయమనం పాటించా.. ప్రజా కోర్టులో కేసీఆర్ దోషిగా నిలబడ్డారు.. ప్రజల గుండెల్లో గద్దర్ వీరుడిగా నిలబడ్డారని అన్నారు.
గద్దర్ మరణాన్ని రాజకీయం చేయొద్దనే నేను విజ్ఞత ప్రదర్శించానని చెప్పారు. లక్ష్యాన్ని చేరేవరకు కార్యదీక్షతో పనిచేస్తామని కేసీఆర్‌ను హెచ్చరిస్తున్నానని అన్నారు. నేను లేవనెత్తిన అంశాలపై, తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) కు 25కు మించి సీట్లు రావు.. అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారని రేవంత్(Revanth Reddy) జోస్యం చెప్పారు.