మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish rao) విమర్శించారు. పక్క రాష్ట్రం వెళ్లగానే రేవంత్ అసలు బుద్ధి చూపించుకున్నాడని, తెలంగాణలో చిల్లిగవ్వ పని చేయలేదు కానీ అక్కడ మాత్రం వేల కోట్లతో పనులు చేసినట్లు చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో చేస్తున్న మోసాలు చాలవన్నట్లుగా మహారాష్ట్ర(Maharashtra)లో కూడా మోసాల పరపంపరను కాంగ్రెస్ కొనసాగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అన్ని వర్గాల చేత ఛీ కొట్టించుకున్న ఈ ప్రభుత్వం.. అన్ని హమీలు అమలవుతున్నాయని ఏ మొఖం పెట్టుకుని చెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏమయ్యాయి. ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతోంది మరి మహిళలకు ఒక్క రూపాయైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.
‘‘అధికారంలోకి వచ్చిన వారంలోనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీ(Runa Mafi) కేవలం 20 లక్షల మంది రైతులకే జరిగింది. మిగిలిన 22 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి. రుణమాఫీ ఆలస్యంగా చేయడం వల్ల ఈ సమయంలో రైతులు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు వల్లిస్తున్నారు. రైతు భరోసా లేదు. రైతు కూలీలకు రూ.12వేల ఇవ్వలేదు. వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు మహారాష్ట్ర లో ప్రచారం చేస్తున్నారు.. రైతుల్లో ఒక్కరికైనా బొనస్ వచ్చిందా? 11 నెలల్లో ఒక్క ఇల్లు కట్టలేదు. కానీ కూల్చడంలో మాత్రం ముందుంటున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. ఇచ్చారా? మీరు ఇచ్చామని చెప్పుకుంటున్న 50వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మహారాష్ట్రలో చెప్పండి తెలంగాణలో మాట తప్పామని’’ అని హరీష్ రావు(Harish rao) విమర్శలు గుప్పించారు.