డీలిమిటేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీనిపై హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. శనివారం ఆయన చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల డీలిమిటేషన్ వ్యతిరేక సమావేశానికి హాజరయ్యారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చలో తమ స్టాండ్ ఏంటో తెలిపారు. సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
“న్యాయబద్ధం కాని డీలిమిటేషన్(Delimitation) పై మనం బీజేపీని అడ్డుకోవాలి. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది. వాజ్ పేయి కూడా లోక్ సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారు. నరేంద్ర మోడీ కూడా అదే పని చేయాలి. లోక్ సభ సీట్లు పెంచకూడదు. దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాం. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించదు” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సరిగా అమలు కాలేదు. ఇక్కడ సవ్యంగా అమలు చేసినందుకు శిక్ష వేస్తారా అని బీజేపీని రేవంత్ ప్రశ్నించారు. “ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది. దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ. మనకు వచ్చేది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి మనకు ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమే. బీహార్ రూపాయి పన్ను కడితే వచ్చేది ఆరు రూపాయలు. యూపీకి రూపాయికి 2 రూపాయల 3 పైసలు వెనక్కి ఇస్తున్నారు. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది. మనకి నష్టం చేస్తుంది” అని సీఎం రేవంత్(Revanth Reddy) అన్నారు.
సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలన్నారు. రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని కోరారు. ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లోక్ సభ(Lok Sabha) స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని సీఎం డిమాండ్ చేశారు.