ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కొందరు ఎదురుదాడి కూడా చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కులమేంటో సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి.. వరంగల్(Warangal) జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగానే వేద ఫంక్షన్ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లారు.
ఈ సందర్బంగానే ఆయన రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన(Caste Census) చేశామంటూ గప్పాలు చెప్పుకుంటున్న కాంగ్రెస్.. సర్వేను పూర్తి చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పైగా ప్రతి లెక్క పక్కాగా ఉందంటూ కహానీలు చెప్తున్నారని, అంత పక్కాగా లెక్క ఉంటే మళ్ళీ రెండో విడత సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
‘‘రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ది ఏ కులమో రేవంత్ రెడ్డి చెప్పాలి. త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు. బిజీ షెడ్యూల్ వల్ల రాష్ట్ర అధ్యక్షుని నియామకం లేట్ అవుతోంది. మాకు బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టేందుకు భయపడుతోంది. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత సంబంధం ఉంది. తెలంగాణలో రూ.10లక్షల కోట్ల నిధులు మేము ఖర్చు చేశాము’’ అని కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు.