ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఊరట దక్కలేదు. నేటితో సీబీఐ, ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలను కోర్టుకు అందజేశారు. 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై చార్జ్‌షీట్ సమర్పిస్తామని వివరించారు.
మరోవైపు కవిత(MLC Kavitha)కు కస్టడీ పొడిగింపు అవసరం లేదని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారని కొత్తగా ఏమీ చెప్పడం లేదని ఆమె తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా మరో 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించారు. అటు ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సైతం మే 7వ తేదీ వరకూ కస్టడీ పొడిగించారు. దీంతో అప్పటివరకూ ఇద్దరూ తీహార్ జైలులోనే ఉండనున్నారు.