మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆర్‌ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే అని.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.
” నేను ఎటువంటి ప్యాకేజీలకు లొంగే వాడిని కాదు. నేను ఏమి ఆశించి పార్టీలోకి రాలేదు. ఏదైనా ఆశించే వాడిని అయితే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లేవాడిని కదా. నాలో ఎటువంటి స్వార్థం లేదు. నా గుండెల్లో బహుజన వాదం ఉంటుంది. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందల వెళ్తున్నారు. ఆ గొర్రెల మందలో ఒక్కణ్ని నేను కాలేను. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. నేను తిరస్కరించాను.. ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి నన్ను సున్నితంగా హెచ్చరిస్తున్నారు. నాకు నా రాజకీయ నిర్ణయం తీసుకునే స్వేచ్చ లేదా? నేనూ పాలమూరు బిడ్డనే.. నడిగడ్డ గాలి పీల్చి పెరిగాను. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇలాంటి హెచ్చరికలు మానుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లు బీఎస్పీకి కేటాయించారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా చేశారు. కాగా నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేయనున్నారు.