టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leakage) వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీఎస్‌పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీ కేసులో నెల రోజులు గడిచినా పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లీకేజీ అంశంపై ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. కేసులో సిట్ అధికారులు 18 మంది నిందితులను అరెస్టు చేసినట్టే చేసి, వారిని భద్రంగా చూసుకుంటోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసే సిట్.. పనిచేయలేక కూలబడిందని ఎద్దేవా చేశారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరీక్షలు రాసి రెండేళ్లు దాటినా ఫలితాలు ఇవ్వకపోవడంతో, విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ విద్యార్థులు తమ సమస్యలపై ముఖ్యమంత్రిని కలుద్దామంటే, కార్యాలయంలోనికి విద్యార్థులకు అనుమతి లభించడం లేదని ఆరోపించారు. కనీసం విద్యాశాఖ మంత్రి(Educational Minister) అయినా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ నియామకాల్లో సింగిల్ పీజీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ఆర్ఎస్పీ(RS Praveen Kumar) డిమాండ్ చేశారు.
Read Also: 47ఏళ్ల వయసులో తండ్రైన సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
Follow us on: Google News, Koo, Twitter