మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఆరోపణలంటే నోటికొచ్చింది అనడం కాదని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కొండా సురేఖను గతంలోనే ప్రజలు తిరస్కరించారని, మహిళలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టాలని కోర్టు కూడా ఆదేశించిందని పలు అంశాలను గుర్తు చేశారు.
ఇప్పుడు తనను టార్గెట్‌గా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఇలానే కొనసాగితే అతి త్వరలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో ఐపీఎస్ అధికారికగా ఉన్న తనను కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించిందని గుర్తు చేశారు. అటువంటి తాను విద్యార్థులకు పెట్టే ఆహారంపై తాను కుంభకోణాలు చేశానని కొండా సురేఖ అనడం ఏమాత్ర సబబు కాదని, అందుకు తగ్గ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఆధారాలు ఉంటే సీబీఐ(CBI)కి అందించాలని అన్నారు. ‘‘విద్యార్థుల సంక్షేమం కోసం ఏడేళ్ల సర్వీస్‌ను వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. అటువంటి నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని కొండా సురేఖ ఆరోపించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలి’’ అని సవాల్ చేశారు.
‘‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గురుకుల సెక్రటరీగా పని చేసి కోట్ల కుంభకోణం చేశారు. గత ప్రభుత్వం ప్రవీణ్ కుమార్‌పై విచారణ చేయలేదు. ఫుడ్ పాయిజన్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రమేయం ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనను సైకో రావు నడుపుతున్నారు అని నేను నమ్ముతున్నా. ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) గురుకులాల్లో మాఫీయా నడిపారు. గతంలో జరిగిన తరహాలో అన్యాయాలు, అక్రమాలు జరుగకుండా పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించటానికి టెండర్ ప్రక్రియ ద్వారా సరకులు అందిస్తున్నాం’’ అని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు.