తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన చిరంజీవి కుటుంబాన్ని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పేదలంతా ఒక్కటై చిత్తుచిత్తుగా ఓడిస్తారని అన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా, పోస్ట్ మార్టం రిపోర్టు, శవపంచనామా కూడా ఇవ్వకుండా, కనీసం చనిపోయిన తర్వాత శవాన్ని చూపించకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిట్స్ వస్తే వ్యక్తి ఎలా చనిపోతారని ప్రశ్నించారు. పేదోల్ల పక్షాన మాట్లాడే వారు లేకపోతే చంపేస్తారా? అని మండిపడ్డారు. కోట్ల రూపాయల స్కాం చేసిన వారిని ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ లాయర్లను పంపి నేరస్తులను కాపాడే ప్రభుత్వం, చిరంజీవి వంటి పేదలను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. ఇసుక దందాను ప్రశ్నించినందుకు నేరెళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దొంగతనం నెపంతో మరియమ్మ, శేఖర్, ఖదీర్ ఖాన్, ఇపుడు చిరంజీవిలను ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాబోయే ఎన్నికల్లో పేదలందరూ ఏకమై కేసీఆర్(KCR) ప్రభుత్వాన్ని ఓడించి, తగిన గుణపాఠం చెప్తారని ఆర్ఎస్పీ(RS Praveen Kumar) హెచ్చరించారు.