రైతు రుణమాఫీ(Rythu Runa Mafi)కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం రుణమాఫీని మాటల్లోనే తప్ప చేతల్లో చూపించలేక పోయిందని విమర్శించింది. బీఆర్ఎస్‌కు చేతకాని పనిని తమ ప్రభుత్వం అమలు చేసిందని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితితో రైతు రుణమాఫీ అమలు చేయడం అంటే ఒక సాహసమే అని చెప్పాలని, కానీ దానిని తమ ప్రభుత్వం చేసిందని చెప్పారాయన.
‘‘చేతగానమ్మకు మాటలెక్కువన్నట్లు రుణమాఫీ(Rythu Runa Mafi)లో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాల ప్రయత్నించారు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 12, 2018 వ సంవత్సరం నుండి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలన్నింటికి రుణమాఫీ వర్తింప చేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాము. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో, పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన 31 వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం. జులై 18న లక్ష రూపాయల వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతన్నలకు 6,035 కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాలలో ఒకేసారి జమ చేసాం. రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతిత్వరలో రుణమాఫీ జరుగుతుంది.
కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది. ఈ రుణమాఫీ తో తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి. వారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది’’ అని భరోసా కల్పించారు.