Hyderabad | నాంపల్లిలో రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌కు గోడకు మధ్య ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు. అతడిని దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. కానీ ఫలితం లేకపోయింది. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు తుదిశ్వాస విడిచాడు. బాలుడిని కాపాడటానికి ఎంతో శ్రమించామని, కానీ బాలుడు మరణించడం చాలా బాధగా ఉందని వైద్య బృందం విచారం వ్యక్తం చేసింది.
పూర్తి వివరాలు చూస్తే.. ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ అనే ఆరేళ్ల బాలుడు శుక్రవారం తన తాతయ్యతో మేనత్త ఇంటికి వెళ్లాడు. తాత చేతిలో లగేజీ ఉండటంతో బాలుడు లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందు లోపలికి వెళ్లాడు. బాలుడి తాతయ్య లగేజీ పెట్టేలోపే లిఫ్ట్ కదలింది. లిఫ్ట్ పైయి వెళ్తుండటంతో భయపడిన బాలుడు బయటకు వచ్చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే లిఫ్ట్‌కు, గోడకు మధ్య ఇరుక్కుపోయాడు. బాలుడు ఇరుక్కుపోవడంతో లిఫ్ట్.. మొదటి అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్‌కు మధ్యలో ఆగిపోయింది. బాలుడి కేకలు, తాతయ్య అరుపులతో అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు.
Hyderabad | వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న నాంపల్లి ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.. డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు, 108 అంబులెన్స్‌లను రప్పించిన హుటాహుటిన సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు రెండున్నర గంటలపాటు కష్టపడి బాబును బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బాలుడి నడుపు, కడుపు భాగాన తీవ్రంగా గాయాలు కావడంతో బాలుడు స్పృహకోల్పోయాడు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతూ బాలుడు శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచాడు.