పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరో కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోగా ఫ్యాన్స్‌ను అలరించిన బన్నీ త్వరలోనే ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉండే బన్నీ.. తనకు పిల్లను ఇచ్చిన మామ కోసం ప్రచారం చేయబోతున్నట్లు చెబుతున్నారు. అల్లు కోడలు స్నేహరెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్‌ఎస్(BRS) రాష్ట్ర నేతగా ఉన్నారు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన ఆయన 2014 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అయితే అప్పుడు కూడా బన్నీ మామ కోసం క్యాంపెయింగ్(Campaign) చేశారు. కాని వర్కౌట్ కాలేదు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా చంద్రశేఖర్ రెడ్డి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి ఈసారి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీని కోసం ఆయన ఇప్పటికే కంచర్ల ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి నియోజకవర్గంలో కార్యకలాపాలను పెంచాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే తన అల్లుడైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రంగంలోకి దింపుతున్నారు. నియోజకవర్గంలో తన రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించడానికి పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన కార్యాలయం, ఫంక్షన్ హాల్‌ను బన్నీ ప్రారంభించనున్నారు. అనంతరం దాదాపు 10వేల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు, అల్లు అర్జున్ అభిమానులకు ఇక్కడే భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి భావించారు. కానీ వేంరెడ్డి నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చివరి ప్రయత్నంగా ఈ ఎన్నికల్లో సాగర్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం దివంగత నేత నోముల నరస్సింహయ్య కుమారుడు భగత్ సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే ఎమ్మెల్యేగా పోటీగా చేయాలని భావిస్తున్నారు. మరోవైపు బన్నీ(Allu Arjun) మామ కూడా ఇక్కడ నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో? గులాబీ బాస్ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారో? వేచి చూడాలి.