BRS MLA Ticket First List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. టికెట్ల కేటాయింపులో 98 శాతం నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం ఇవ్వడం గమనార్హం. అయితే ఇలాంటి కీలక సమయంలో మంత్రి కేటీఆర్ ఫారిన్ టూర్ లో ఉండటంతో కొంతమంది ఆశావహులైన బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న బాస్ వర్గీయులకు ఈసారి ప్రాధాన్యత లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో మొదలైంది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా కేసీఆర్ సిట్టింగ్ ల పేర్లు ప్రకటించారనే విమర్శలు ఉన్నాయి.
అయితే ఇవన్నీ కేసీఆర్ ని కలిసి వివరించే ధైర్యం కానీ, ఆయన ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే ధైర్యం కానీ పార్టీ శ్రేణుల్లో లేకపోవడంతో.. కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. చాలా సెగ్మెంట్లలో ఈసారి ఆశలు పెట్టుకున్న కేటీఆర్ టీంకు నిరాశే ఎదురైంది. కాగా, ఎన్నికల నాటి పరిస్థితుల ప్రకారం అభ్యర్థులను మారుస్తామని కేసీఆర్ సంకేతాలు ఇవ్వడంతో టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక పరిస్థితులు, సర్వేల ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనగామ వంటి సెగ్మెంట్లతో పాటుగా పలు నియోజక వర్గాల నుంచి మంత్రి కేటీఆర్ టీంలో టికెట్లు ఆశించిన ఆశావాహులు కేటీఆర్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై వస్తున్న వ్యతిరేకత ను ఎప్పటికప్పుడు కేటీఆర్ కు పంపిస్తున్నారు.
BRS MLA Ticket First List | బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య, కోదాడ నుంచి మల్లయ్య యాదవ్, మంథని సెగ్మెంట్లో పుట్టా మధు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లెందులో హరిప్రియా నాయక్, వరంగల్ ఈస్ట్ నన్నపనేని నరేందర్, మల్కాజిగి రిలో మైనంపల్లి హన్మంతరావు, కల్వకు ర్తిలో జైపాల్ యాదవ్, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడ్డి, రామగుండంలో కోరుకంటి చందర్, కంటోన్మెంట్లో లాస్య నందితకు అధిష్టానం టికెట్ ఖరారు చేయగా.. ఈ సెగ్మెంట్లలో కేటీఆర్ టీం ప్రత్యామ్నాయ మార్గాల్లో నిమగ్నమైంది. అయితే టికెట్ల ప్రకటన సందర్భంగా మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో కొంతమంది ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు దగ్గరకు వెళ్లి ప్రయ త్నాలు చేసుకున్నారు. కానీ, అవేవీ సఫలం కాలేదు. దీంతో కేటీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆశావహులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆయన వస్తే తమ టికెట్ పై క్లారిటీ వస్తుందని, అప్పుడే భవిష్యత్ కార్యాచరణ పై ఆలోచించవచ్చని ఆశిస్తున్నారు.