ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి అధికారులు మరో షాకిచ్చారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(State Finance Corporation) నుంచి తీసుకున్న రూ. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. మామిడిపల్లిలోని జీవన్ రెడ్డి ఇంటికి నోటీసులు అతికించిన అధికారులు.. ఆయనతో పాటు ష్యూరిటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి కూడా నోటీసులు పంపారు. 2017 లో భార్య పేరుట లోన్ తీసుకున్న జీవన్ రెడ్డి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని వెల్లడించారు అధికారులు. అసలు కాకపోయినా కనీసం వడ్డీ కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. ఇచ్చిన కడుగు పూర్తయ్యేలోగా తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే, కొద్ది రోజుల క్రితమే జీవన్ రెడ్డి(Jeevan Reddy) షాపింగ్ మాల్ ని అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. మాల్ కోసం ఆయన ఆర్మూర్(Armoor) లోని ఆర్టీసీ బస్ స్టాండ్ ని లీజుకు తీసుకున్నారు. దీనికి సంబంధించి కోట్లలో బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఈ మాల్ ని సీజ్ చేశారు. కాగా, ఇదే మాల్ నిర్మాణం కోసం జీవన్ రెడ్డి తన భార్య పేరిట 2017 లో స్టేట్ కార్పొరేషన్ నుండి రూ.20 కోట్ల రుణం తీసుకున్నారు. అదే రుణాన్ని తిరిగి చెల్లించమని అధికారులు ఎన్ని నోటీసులు పంపినా ఆయన స్పందించకపోవడంతో ఈరోజు తన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. వారం రోజుల్లో వడ్డీతో సహా అప్పు చెల్లించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల ద్వారా వార్నింగ్ ఇచ్చారు.