బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎట్టకేలకు నర్సాపూర్ అసెంబ్లీ టికెట్‌పై నిర్ణయం తీసుకున్నారు. కొన్నిరోజులుగా ఈ టికెట్‌పై సందిగ్ధత నెలకొంది. చివరకు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy) వైపే గులాబీ బాస్ మొగ్గుచూపారు. ప్రగతిభవన్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి కేసీఆర్ ఆమెకు బీఫారం అందించారు. మదన్ రెడ్డి నిరాశ చెందకుండా ఆయనకు మెదక్ ఎంపీ సీటు ఆఫర్ చేశారు. దీంతో నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి విజయానికి ఆయన కృషి చేస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు పర్యాయాల నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మదన్ రెడ్డి(Madan Reddy) తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడని కేసీఆర్ అన్నారు. 35 ఏళ్ల నుంచి తనతో సన్నిహితంగా కొనసాగుతున్నారని.. తనకు అత్యంత ఆప్తుడని కొనియాడాదరు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy)ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
మెదక్ ఎంపీ సీటును బీఆర్ఎస్ సునాయాసంగా గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. అందుకే ఎంపీగా పోటీ చేసేందుకు మదన్ రెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.