వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూములపై(Kancha Gachibowli Lands) సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ సాధికార కమిటీ (CEC) గురువారం రెండు రోజుల తనిఖీని ప్రారంభించింది. తమ పర్యటన సందర్భంగా ప్రభుత్వ అధికారులు, విద్యార్థి సంఘాలు, NGOలు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరపనున్నారు. సిద్ధాంత్ దాస్ నేతృత్వంలోని సభ్యులు సీపీ గోయల్, సునీల్ లిమాయే, జెఆర్ భట్లతో కూడిన కమిటీ బుధవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకుంది. గురువారం ఉదయం హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న 400 ఎకరాల స్థలంలో క్షేత్ర పరిశీలన ప్రారంభించింది. క్షేత్ర పర్యటన సందర్భంగా సీనియర్ అధికారులు కమిటీ సభ్యులతో పాటు ఉన్నారు.
అభివృద్ధి పేరిట కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో(Kancha Gachibowli Lands) ప్రభుత్వం చెట్ల నరికివేత ప్రారంభించింది. దీంతో పర్యావరణ ప్రేమికులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అభివృద్ధి పేరు చెప్పి తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ పర్యావరణానికి హాని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు కొట్టేయడంతో అక్కడ ఉన్న వన్య ప్రాణులకు నష్టం జరుగుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే దీనిని నిలిపివేయాలని నిరసనలు చేపట్టారు.
మీడియాలో నివేదికల అనంతరం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. వెంటనే ఆ భూములలో ప్రభుత్వ చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసి వివరణాత్మక నివేదికను సమర్పించాలని CECని ఆదేశించింది. ఈ కమిటీ నేరుగా సుప్రీంకోర్టు అధికార పరిధిలో పనిచేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా సీనియర్ ప్రభుత్వ అధికారులతో ప్యానెల్ సమావేశం కానుంది. శుక్రవారం, ఆ స్థలంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్న NGOలు, విద్యార్థి సంఘాలు, ఇతర వాటాదారులతో కమిటీ చర్చలు జరపనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కమిటీ ఏప్రిల్ 16 లోపు తమ నివేదికను సమర్పిస్తుంది. ఇది కంచె గచ్చిబౌలి భూమి విధిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.