HCU Land Issue | తెలంగాణలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. చెట్ల రక్షణ మినహా అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 16 లోపు ఆ స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీ (CEC)ని ఆదేశించింది. ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడితే తెలంగాణ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎజి మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను కంచ గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్న 3:30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కంచె గచ్చిబౌలి భూములను సందర్శించి, అక్కడ చెట్ల నరికివేత ఇంకా కొనసాగుతోందని సుప్రీం కోర్టుకి మధ్యంతర నివేదిక పంపారు. అక్కడ పరిసరాలను ఫోటోలు తీసి పంపారు. నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు.. ఇది చాలా సీరియస్ విషయం అని నొక్కి చెప్పారు.
HCU Land Issue | కోర్టు తీర్పు ఇచ్చేవరకు చిన్న పని జరిగినా, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కేసు (2023) ఆధారంగా సీఎస్ ను సస్పెండ్ చేసే అధికారం కూడా మాకు ఉంటుంది అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడ చెట్లు అన్ని నరికి ఏం చేస్తున్నారు? తిరిగి నాటుతున్నారా లేదా? అని ప్రశ్నించింది. మీరు వేసిన కమిషన్ లో అసలు ఫారెస్ట్ ఆఫీసర్ లేడు, మరి అక్కడ అధికారులు ఎందుకు ఉన్నారు? అని నిలదీసింది. ఏప్రిల్ 16 లోపు వీటన్నిటికి సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లకొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పుతో HCU విద్యార్థులు సంబురాలు జరుపుకుంటున్నారు.