కేసీఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని ఆయన కొనియాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించి కుట్రపూరితంగా కాంగ్రెస్ అధికారం దక్కించుకుందని విమర్శించారు. మంగళవారం సూర్యపేటలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. జోగులాంబ నుంచి ఆలంపూర్ వరకు బీఆర్ఎస్(BRS) అభ్యర్థులు అందరూ ఓటమి పాలయినప్పటికీ, సూర్యాపేట మాత్రం బొడ్రాయిలా నిలిచి గెలిచిందని అన్నారు. మళ్లీ ఎన్నికల వరకు ఒక్కటి కూడా వదలకుండా అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంచి కొరకు నిలబడి, త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర సూర్యాపేట ప్రజలదని.. అందుకు నా ఈ గెలుపే నిదర్శనం అన్నారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జరిగిన లోటుపాట్లను ఆలోచన చేసుకావాలని, పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులు కుట్రపూరితంగా పదేళ్లు అధికారంలో ఉన్నారనే వాదనను తీసుకువచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు మాజీ మంత్రి. రెండుసార్లు ప్రజలు అధికారం ఇస్తే.. కేసీఆర్(KCR) దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టారని ప్రశంసించారు. కేసీఆర్ కి ఉన్న విజన్, ఆలోచన ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్లకు లేదని విమర్శించారు. ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారని, ప్రజల ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని కార్యకర్తలకు సూచించారు. మనం ముందుగా అనుకున్నట్లుగానే చిల్లర వేషాలు మొదలయ్యాయని, ఇవి మన నల్లగొండలో ముఖ్యంగా సూర్యాపేటలో అధికంగా ఉంటాయన్నారు. కేసీఆర్ కొట్లాటలు, గొడవలు ఉండొద్దని, అవి అభివృద్ధికి ఆటంకాలని పది ఏళ్లుగా ప్రశాంతంగా ఉంచారాని గుర్తు చేశారు. మనలాగా చేయడం ఎవరితోనూ కాదని అది అందరికీ తెలుసని అన్నారు. సూర్యాపేటలో ఓటమి పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy)ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు నేను చెప్పినట్లుగానే వృద్ధ సింహం గాండ్రిస్తుందని, అసెంబ్లీకి పోకున్నా , అన్నీ చేస్తామని అంటున్నాడని, ఎలా చేస్తాడు? ఏం చేస్తాడు? నాలా 24 గంటలు కష్టపడి పని చేస్తాడా? నాతో సమానంగా నాలుగు గంటలకు లేస్తాడా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు(Rythu Bandhu) ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని ఇప్పుడు పాత పద్ధతి వేస్తామని అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చదని, నెరవేర్చినట్లు చరిత్రలో కూడా లేదన్నారు. రోజులు కాదు కదా 900 రోజులు ఆగినా హామీలు అమలు కావని, ప్రజల నుంచి ప్రశ్న రావాలని.. అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారు. ఇవ్వడం చేతకాక దాని నుంచి తప్పించుకునేందుకు అప్పులు చేశారని అంటున్నారని, అసెంబ్లీలో నన్ను అడిగితే దానికి సమాధానం నేను చెప్పేవాడిని అన్నారు. గత ప్రభుత్వాల్లో 6 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే.. మనం 18 మెగావాట్లు ఉత్పత్తి చేశామని, అప్పుడు జెన్కో ఆస్తులు 18 వేల కోట్లు అయితే ఇప్పుడు 50 వేల కోట్లు అయ్యాయని, ఇప్పుడొచ్చింది ఆరు గంటల కరెంటు అయితే అప్పుడు నేను ఇచ్చింది 24 గంటల కరెంట్ అని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.