ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) తనదైన శైలిలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై విమర్శలు చేసారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను అవలంబించారన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ కాబడిన విషయం తెలిసిందే. తనపై సస్పెన్షన్ ఉన్నప్పటికీ, BCల అభ్యున్నతి కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తానని మల్లన్న వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన కులగణన పారదర్శకంగా జరిగితేనే దేశానికి ఆదర్శంగా ఉంటుందని ఆయన అన్నారు. సర్వేలో BCలను అణచివేయడానికి ప్రయత్నిస్తూ.. అగ్ర కులాల జనాభాను ఎక్కువగా చూపిందని MLC ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజెపీ కి మద్దతు ఇస్తున్నారని మల్లన్న సంచలన కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే బీజేపీ కి వచ్చిన 8 లోక్ సభ సీట్లు కూడా కాంగ్రెస్ కే వచ్చి ఉండేవని.. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే విధానాలతో వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ఏడాది మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ రెడ్డి కారణమని ఆయన(Teenmar Mallanna) ఆరోపించారు. కులగణన సర్వే రాహుల్ గాంధీని(Rahul Gandhi) తల ఎత్తుకుని నడిచేలా చేస్తుందని తాను ఆశించినట్లు తెలిపారు. ఒక సంవత్సరం లోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని మల్లన్న రేవంత్ రెడ్డిని కోరారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే పై, ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులు జారీచేసింది. మల్లన్న నుండి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మార్చి 1న పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందున సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి (Chinna Reddy) తెలిపారు.