Telangana Assembly Elections |తెలంగాణలో ఎన్నికల హీట్ రోజురోజుకు హీటెక్కుతోంది. నేతలు హోరాహరి ప్రచారాలతో దూసుకుపోతున్నారు. పోలింగ్ మరో 27 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నారు. మరోవైపు రేపు పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్‌లను స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.
శుక్రవారం ఉదయం పది గంటల నుంచి అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద దాఖలు చేయవచ్చు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈనెల 5వ తేది ఆదివారం కావడంతో ఆరోజు మాత్రం నామినేషన్లు స్వీకరించరు. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో సమావేశం నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు పాల్గొన్నారు.
Telangana Assembly Elections |ఇక సీఎం కేసీఆర్ తొలిసారిగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేది ఉదయం గజ్వేల్‌లో నామినేషన్ సమర్పిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. అలాగే ఇతర కీలక నేతలు కూడా నామినేషన్లు వేసేందుకు మంచి రోజు మంచి ముహుర్తం చూసుకుంటున్నారు.