Telangana Cabinet | రాష్ట్రంలో మళ్లీ అధికారంపై గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను కేసీఆర్ కొట్టిపారేశారని వెల్లడించాయి. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి ఆదివారం సంబరాలు చేసుకుందామని నాయకులకు కేసీఆర్ భరోసా ఇచ్చారట. మరోవైపు సోమవారం మంత్రివర్గ సమావేశానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. సచివాలయంలో డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్(Telangana Cabinet) భేటీ జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు చాలాకాలం తర్వాత గురువారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని మంత్రి KTR ట్వీట్ చేశారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు అతిశయోక్తిగా ఉన్నాయన్న కేటీఆర్.. ఎగ్జాట్ పోల్స్‌లో తమకు శుభవార్త చెబుతాయని తెలిపారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 70.79% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ మూడు శాతం తగ్గిందని పేర్కొ్‌న్నారు. అలాగే రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56% పోలింగ్ నమోదైందని వెల్లడించారు.