తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 14 నుంచి రైతు భరోసా(Rythu Bharosa) అమలు చేయనుంది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అయితే పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాకి సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అందులో భాగంగా జనవరి ఐదు నుంచి జనవరి 7 వరకు దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎల్లుండి జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
రైతులంటే ఎందుకింత కక్ష రేవంత్? -BRS
రైతు భరోసా(Rythu Bharosa) ఆలస్యంపై బీఆర్ఎస్, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. “ఇప్పటికే రెండు దఫాల రైతు భరోసా ఎగ్గొట్టి రైతులను గోస పెడుతున్న రేవంత్ సర్కార్, ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా అంటూ కొత్తగా మెలిక పెడుతోంది.
నాడు మూడు సార్లు రైతు భరోసా ఇస్తామని మోసపు ప్రకటనలు చేసి ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడానికి అనేక కొర్రీలు పెడుతూ అన్నదాతలను మోసం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్” అంటూ బీఆర్ఎస్(BRS) నేతలు ఏడాది కాలంగా ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ సంక్రాంతి సందర్భంగా రైతు భరోసా అమలుకు నిర్ణయం తీసుకుంది.