సెప్టెంబర్ 2న జరగాల్సిన తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్(Telangana Congress) ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. అదే రోజున దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతితో పాటు పలు కార్యక్రమాలు ఉన్నందున సమావేశం వాయిదా వేయాలని కాంగ్రెస్ నేతలు టీపీసీసీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ రోజు జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించేందుకు టీపీసీసీ ఆమోదం తెలిపింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో స్క్రూటినీ చేయనుంది. మరోసారి అభ్యర్థుల ఎంపికపై సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో ఫుల్ జోష్ వచ్చింది. ఎంతలా అంటే హస్తం గుర్తుపై పోటీ చేసేందుకు నేతలు తహతహలాడుతున్నారు. ఒక అసెంబ్లీ సీటు కోసం 20 నుంచి 30 మంది పోటీ పడుతున్నారు. 119 నియోజకవర్గాలకు ఏకంగా 1035 దరఖాస్తులు వచ్చాయంటే నేతలు పోటీకి ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు సీటుకు 31 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 1025 దరఖాస్తులు వస్తే ఇందులో గ్రేటర్ పరిధిలోని సీట్ల నుంచి పోటీ చేసేందుకు 263 మంది పోటీ పడుతున్నారు. రెండు జిల్లాల్లోని 29 అసెంబ్లీ స్థానాలకు… ఊహించని విధంగా పోటీ ఏర్పడింది.
కంటోన్మెంట్ సీటు కోసం 21 మంది పోటీ పడుతుండగా.. కూకట్ పల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాల కోసం 16 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. గోషామహల్ నియోజకవర్గానికి 15, శేరిలింగంపల్లి, చేవెళ్ల స్థానాలకు 14, కుత్బుల్లాపూర్ కు 12. రాజేంద్రనగర్ కు 11 , యాకుత్‌పురా, ఎల్‌బీనగర్ స్థానాలకు 10, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్ స్థానాలకు 9 మంది, మహేశ్వరం, సనత్ నగర్, ముషీరాబాద్ లకు 8 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మలక్ పేట, కార్వాన్ స్థానాలకు ఏడుగురు చొప్పున, జూబ్లీహిల్స్, మేడ్చల్, ఉప్పల్, అంబర్ పేట స్థానాలకు ఆరుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా స్థానాలకు 5 మంది, మల్కాజిగిరి, పరిగి సీట్లకు ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు.