Telangana Congress Leader Fight infront of Digvijaya Singh in Gandhi Bhavan: గాంధీ భవన్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను చక్కబెట్టేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కి అనూహ్య పరిణామం ఎదురైంది. ఆయన నేతలతో చర్చిస్తుండగానే వార్ రూమ్ బయట మరికొందరు నేతలు గుల్లాలు పట్టుకుని వాగ్వాదానికి దిగారు. వలస నేతలు అంటూ కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న విమర్శలపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన మీడియా సమావేశంలో సైతం మాజీ టీపీసీసీ అధ్యక్షుడిపై అనిల్ కుమార్ పలు ఆరోపణలు చేశారు.
అయితే గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యేందుకు వచ్చిన ఓయూ నేతలు అనిల్ కుమార్ ని చూసి సేవ్ కాంగ్రెస్(Telangana Congress) అంటూ ఒక్కసారిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అనిల్ కుమార్ సీనియర్లకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పార్టీలో ఎప్పటి నుండో కష్టపడుతున్నవారికి కాకుండా వలస వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ రేవంత్ వర్గంపై ఘర్షణకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు గల్లాలు పట్టుకుని గలాటా కి దిగారు.
కాగా, వివాదాన్ని సర్దుమణచడానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రయత్నించారు. నేతల మధ్యకి చేరుకొని ఇరువర్గాలవారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు సైలెంట్ అవకపోవడంతో “దండం పెడతా.. ఆపండి” అని గట్టిగా అరిచి రిక్వెస్ట్ చేశారు. దీంతో వివాదం కొంతమేర సద్దుమణిగింది.