ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కుస్తీ… టికెట్ దక్కేది ఎవరికి?

-

హస్తం పార్టీలో టికెట్ల కేటాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ నెలాఖరు వరకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి పంపించిన జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రెండు రోజులు చర్చించనుంది. బుధవారం రాత్రి సమావేశమైన పీఈసీ.. గురువారం మరోసారి సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించే ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవాని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు.

- Advertisement -

తుక్కుగూడ సభ తర్వాత జోష్

కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావహుల ప్రయత్నాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఏఐసీసీ నిర్వహించిన సీడబ్ల్యూసీ మీటింగ్, తుక్కుగూడ విజయభేరి సభ తర్వాత పార్టీలో జోష్ కనిపిస్తోంది. దీంతో ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు ఢిల్లీ బాట పట్టారు. అధినేతల దగ్గర పైరవీ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరుగుతోందని టీపీసీసీ సర్వేల్లో తేలడంతో.. ఈసారి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది బెంగళూరుకు కూడా వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో డీకే శివ కుమార్ కూడా కీలకంగా మారడంతో.. ఆయన ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది బీసీ నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ హరిప్రసాద్ ద్వారా ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో సంబంధం ఉన్న మాణిక్కం ఠాగూర్, దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, వీరప్ప మొయిలీ ద్వారా కూడా తమ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పరిశీలన తర్వాతే ఖరారు..

అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సర్వే నివేదికలను తెప్పించుకున్న స్క్రీనింగ్ కమిటీ.. ఆయా చోట్ల అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే నేతల కోసం వెతుకుతోంది. క్షేత్రస్థాయి పరిశీలన, టీపీసీసీ సర్వే నివేదికల తర్వాత పూర్తిస్థాయిలో వడపోత అనంతరం తమ నివేదికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ సిఫారసు చేయనుంది. ఇప్పటికే కొన్ని సెగ్మెంట్ల నుంచి ఒకరిద్దరి పేర్ల ప్రతిపాదనలతోపాటు ముగ్గురు, నలుగురు నాయకులు పోటీపడుతున్నట్లు పీఈసీ ప్రతిపాదనలు చేసింది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతులు ఆధారంగా చేసుకుని అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తుందని సమాచారం.

కొన్ని టిక్కెట్లు ఖరారు!

రాష్ట్రంలోని దాదాపు 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారైనట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ ముఖ్య నేతలతో పాటుగా కొన్ని సెగ్మెంట్లలో ఒక్క పేరు వచ్చిన వాటిని స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లతో పాటుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతల పేర్లు ఖరారైనట్లుగా సమాచారం. అయితే దాదాపు 70 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెగ్మెంట్ల నుంచి గతంలో పోటీ చేసిన వారితోపాటు టీపీసీసీ సిఫారసు చేసిన వారు ఉన్నారని, దాదాపు ప్రతి సెగ్మెంట్ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నట్లు వెల్లడైంది. ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులను కొలిక్కి తెచ్చేందుకు స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సైతం పిలిచారు. స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్ సభ్యులుగా ఉండగా.. పలు అభిప్రాయాల సేకరణ కోసం రేవంత్, భట్టిని పిలిచినట్లు చెబుతున్నారు.

ఈ నెలాఖరు నుంచి స్టార్ట్..

అధికార బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అటు బీజేపీ కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులు అందుకుంది. ఢిల్లీ పెద్దలకు జాబితా పంపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా చాలా రోజుల ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నది. అయితే కాంగ్రెస్ నేతలు హస్తిన నుంచి ఒత్తిళ్లు తీసుకురావడం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో టికెట్ల ఖరారు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నుంచి కూడా రంగంలోకి దిగారు. అటు డీకే శివకుమార్ కూడా ఒక వర్గానికి అండగా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ పరిశీలన, ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈ నెలాఖరు నుంచి జాబితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. తొలుత సింగిల్ పేరు ఉన్న 35 నియోజక వర్గాల అభ్యర్థులను ప్రకటించి.. ఆ తర్వాత వెంటవెంటనే ఆయా సెగ్మెంట్ల అభ్యర్థులను ఖరారు చేయనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ వార్త మీకోసమే..

Eat Sweets | స్వీట్స్ అందరికీ నచ్చేవి.. ఊరించేవి. ఆ తర్వాత...

గవర్నర్ హరిబాబును ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు..

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను...