Telangana CS Somesh Kumar will join AP Cadre: తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ (CS) సోమేశ్ కుమార్ గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో చేరనున్నారు. హైకోర్టు తీర్పు, డీవోపీటీ ఉత్తర్వుల మేరకు ఆ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి జాయినింగ్ రిపోర్టు ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి తెలంగాణలోనే సర్వీసులో ఉన్న సోమేశ్ కుమార్ వివిధ హోదాల్లో పనిచేసి సీఎస్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏపీ క్యాడర్లో చేరుతున్నందున ఏ స్థాయిలో పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చినా చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్తారా లేక రిజైన్ చేస్తారా లేక వీఆర్ఎస్ తీసుకుంటారా అనే సస్పెన్స్ కు సోమేశ్ కుమార్ మరికొన్ని గంటల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
ఏపీకి వెళ్ళడానికి సుముఖంగా లేరనే వార్తలు వినిపించినప్పటికీ పబ్లిక్ సర్వెంట్‌గా ఎక్కడైనా పనిచేయడానికి మానసికంగా సిద్ధం కావాలనే నిర్ణయానికి సోమేశ్ కుమార్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పదవీ కాలం ఈ ఏడాది చివరి వరకూ ఉన్నందున ఒక సంవత్సరం కాలాన్ని వృథా చేసుకోవాలనే ఆలోచనలో ఆయన లేనట్లు సమాచారం. తెలంగాణ నుంచి రిలీవ్ చేయాలంటూ డీవోపీటీ లేఖ రాయడంతో మరికొన్ని గంటల్లోనే ఆయనను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. డీవోపీటీ విధించిన డెడ్‌లైన్‌కు అనుగుణంగా గురువారంలోగా అక్కడ జాయిన్ కావాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గురువారం ఉదయమే అక్కడకు వెళ్ళి సీఎస్ జవహర్‌రెడ్డికి రిపోర్టు చేయనున్నారు.