తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో పోలీసు అధికారులతో పాటు, కానిస్టేబుళ్లు భార్యలు, కుటుంబీకులు కూడా పాల్గొన్నారు. వరంగల్‌లోని మామునూరులోని బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద 4వ బెటాలియేన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. అదే విధంగా నల్గొండ గ్రామీణ ఎస్ఐ సైదాబాబుకు కూడా నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఎస్ఐ గోబ్యాక్ అంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుల్లు నినాదాలు చేశారు. పోలీసుల కుటుంబీకులపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. పోలీసుల ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేందర్(DGP Jitender) ఘాటుగా స్పందించారు.
DGP Jitender ఏమన్నారంటే..
ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. సెలవులపై పాత పద్దతిని అమలు చేస్తామని చెప్పినా ఆందోళనలకు దిగడాన్ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుందని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లో సహించమని స్పష్టం చేశారు. ‘‘ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతభత్యాలు తెలంగాణలో చెల్లిస్తున్నారు. పోలీసుల సంక్షేమం కోసం భద్రత, ఆరోగ్య భద్రత లాంటివి అమలు చేస్తున్నాం. పోలీసు ఇమేజ్‌ను కాపాడటం మన బాధ్యత. ఇలా రోడ్లెక్కి ఆందోళన చేయడం సరికాదు. సీనియర్ పోలీసు అధికారులుగా మీ సమస్యలు పరిష్కరిస్తాం. దర్బార్‌లో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను వివరించుకోవచ్చు. ఇప్పుడు ఆందోళనలు తెలుపుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రకటించారు.