తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్య అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోనే కాదు తెలుగు ప్రజలకు ఆయన తెలియని వారంటూ లేరు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఇటీవల అపోలో ఆసుపత్రిలో చికిత్సలో పొందుతున్న ఆయనను జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించారు. గద్దర్‌ను కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్(Gaddar) అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై పోరాడిన గద్ధర్.. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయన వెన్నుపూసలో తూటా ఇరుక్కుంది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు గద్దర్ ఊపుతెచ్చారు. అలాగే నీపాదం మీద పుట్టుమచ్చనై.. పాటకు నంది అవార్డు రాగా ఆ అవార్డును గద్దర్ సున్నితంగా తిరస్కరించారు. మాభూమి సినిమాలో వెండి తెరపై కూడా కనిపించారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరుగా ఉన్నారు.