Telangana | పెళ్లి కాబోయే యువతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈరోజు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తోపాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్నికలవేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాలికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్లాన్స్ రెడీ చేయమన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడానికి అధ్యయనం చేయాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లకి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయమని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.