రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం కోసం ట్రాఫిక్ వాలంటీర్ల(Traffic Volunteers)ను నియమించాలని, ఆ స్థానంలో ట్రాన్స్ జెండర్లను నియమించాలని రేవంత్ రెడ్డి సూచించారని అధికారులు చెప్పారు.
ఈ క్రమంలోనే చర్యలు కూడా చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాన్స్‌జెండర్ల(Transgender)కు రిక్రూట్‌మెంట్ నిర్వహించారు అధికారులు. వీరికి కూడా రన్నింగ్, జంపింగ్ వంటి పలు ఇతర పరీక్షలు పెట్టారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.
తెలంగాణ మొత్తంలో 3 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉంటే.. హైదరాబాద్ నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆసక్తి ఉన్నవారిని గుర్తించి నియమించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం రేవంత్ గతంలోనే ఆదేశించారు.
ప్రస్తుతం హోంగార్డులు, పోలీసులు.. ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలోనే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్లను కూడా వాలంటీర్లు(Traffic Volunteers)గా నియమించనున్నారు అధికారులు. అర్హులకు పది రోజుల పాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్‌తో పాటు ప్రతి నెల నిర్దేశిత స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు.