Abhaya Hastham Application |తెలంగాణ సచివాలయంలో అభయ హస్తం కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాపాలన లోగో, 6 గ్యారంటీల దరఖాస్తు ఫార్మ్ ని రేవంత్ రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి(Bhatti Vikramarka), మంత్రులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది.
కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుందని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండా ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలలో కూడా అభయహస్తం అప్లికేషన్లు(Abhaya Hastham Application) ఇవ్వచ్చు అని చెప్పారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వొచ్చని చెప్పారు. గ్రామ సభల తర్వాత కూడా దరఖాస్తు అందజేయవచ్చని సీఎం తెలిపారు. ఎవరి కోసం ఎదురు చూడంకండి.. ఎవరి దగ్గరకు పోకండి.. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది అని ప్రజలకు సూచించారు. అధికారులు ప్రజలను రప్పించుకోవడం కాదు.. వాళ్ల దగ్గరకే అధికారులు పోవాలి అని అన్నారు సీఎం రేవంత్.