Telangana governor tamilisai faced a bitter experience in siddipet on protocol issue: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కి, అధికార పార్టీకి కొంతకాలంగా పొసగట్లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు పర్యటనల్లో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై పలుమార్లు ఆమె బాహాటంగానే అసహనం, ఆవేదన వెళ్లగక్కారు. TRS పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే గవర్నర్ పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
గవర్నర్ తమిళిసై గురువారం సిద్ధిపేట జిల్లాకు వెళ్లారు. ఓ కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట వెళ్లిన ఆమెకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్, ఎస్పీలు కానీ ఆమెకు స్వాగతం పలికేందుకు ముందుకు రాకపోవడం విశేషం. ప్రోటోకాల్ విషయంలో గవర్నర్ ఎన్నిసార్లు అసహనం వ్యక్తం చేస్తోన్నా అధికారుల తీరులో మార్పు రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
కాగా గవర్నర్ తమిళిసై(governor tamilisai) కొద్దిసేపటి క్రితం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. డీఆర్ఓ, ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. తమిలి సై స్వామివారి సన్నిధిలో పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు, మొమెంటో అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కామెంట్స్:
పురాతనమైన, అతి శక్తివంతమైన మల్లికార్జున స్వామి దేవుని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా సంతోషకరం.
ఈ సందర్భంగా మీతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ, దేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కొమురవెల్లి మల్లన్న దేవుని కోరుకున్నాను.
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో ప్రత్యేకంగా మాట్లాడి కొమురవెల్లి కి రైల్వే కనెక్షన్ త్వరగా పూర్తయ్యేలా చూస్తా.
తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు బైరాన్ పల్లి గ్రామానికి ఆహ్వానించారని, విద్యార్థుల ఆహ్వానం మేరకు బైరాన్ పల్లి వెళుతున్నానని గవర్నర్ తమిళిసై తెలిపారు.