తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు మరోసారి శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల(Traffic Challans) చెల్లింపులపై రాయితీ గడువును ఫిబ్రవరి నెల 15 వరకూ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు 25 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 10 వరకు గడువు ఇచ్చింది. దీంతో పెండింగ్ చలాన్లతో ప్రభుత్వానికి రూ.113 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో ఆ గడువును జనవరి 31వరకు పెంచింది. ఈరోజుతో ఆ గడువు ముగియడంతో మరోసారి పొడిగించింది.
కాగా ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాల చలాన్లపై 60 శాతం ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ రికార్డుల ప్రకారం 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఇందులో 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల(Traffic Challans)ను జనవరి 10లోపు చెల్లించినట్లు చెబుతున్నారు.