ధరణి పోర్టల్(Dharani Portal) నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్(NIC)కు అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి ఈ బాధ్యతలను ఎన్ఐసీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ధరణి పోర్టల్‌లో అనేక సమస్యలు ఉన్నాయని ఈ పోర్టల్ ప్రారంభించిన రోజుల నుంచి ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ధరణి సమస్యలను తీరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన పదినెలల తర్వాత ధరణి పోర్టల్ నిర్వాహకులను మార్చింది. కాగా ఇంకా ధరణి వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించాల్సిన పని మిగిలే ఉంది. ఈ సమస్యలపై కూడా ప్రభుత్వం అతి త్వరలోనే దృష్టి సారించనుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే వీటి పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందని కూడా సమాచారం.
అయితే ఇన్నాళ్లూ ధరణి పోర్టల్‌ను నిర్వహించిన ప్రభుత్వ ప్రైవేటు సంస్థ క్వాంటెలా ఒప్పంద గడువు ఈ ఏడాది తొలి త్రైమాసికంతోనే ముగిసింది. దాంతో ఆ సంస్థకు తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను అప్పగించింది రెవెన్యూ శాఖ. ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, టీజీటీఎస్ ఎండీతో పాలు పలువురు ఐఏఎస్‌లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ధరణి నిర్వహణ బాధ్యతలను టీజీటీఎస్, సీజీసీ, ఎన్ఐసీ సంస్థలకు అప్పగించే అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్(Dharani Portal) నిర్వహణను తక్కువ వ్యయంతో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటూ ఎన్ఐసీ ముందుకు వచ్చింది. దాంతో ప్రభుత్వం కూడా ఎన్ఐసీ వైపే మొగ్గు చూపింది.