తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ అనేక నూతన కట్టడాలను నిర్మించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project), యాదాద్రి ఆలయం(Yadadri Temple), సచివాలయం(Telangana Secretariat) వంటి అనేక నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ నిర్మాణాలకు అంతర్జాతీయంగా అనేక అవార్డులు సైతం వరించాయి. తాజాగా.. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు మళ్లీ అంతర్జాతీయ అవార్డు లభించాయి. తెలంగాణ సచివాలయం, యాదాద్రి ఆలయంతో సహా మరో మూడు నిర్మాణాలకు అవార్డులు వచ్చాయి. లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్(Green Organization) అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు(Green Apple Awards) లభించాయి. అవార్డులు దక్కించుకున్న నిర్మాణాలలో సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నాయి. భారత్‌కు గ్రీన్ యాపిల్ అవార్డులు(Green Apple Awards) రావడం ఇదే తొలిసారి అని గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ వెల్లడించింది. ఈనెల 16న లండన్‌లో అవార్డులను అందజేయడం జరుగుతుంది. ఈ అవార్డులను స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ అందుకోనున్నారు.