తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) తీపికబురు చెప్పారు. అనేక కారణాల ద్వారా మూడు నెలలుగా రుణమాఫీ అందని వారందరికీ రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. నవంబర్ 30న పాలమూరు వేదికగా జరిగే రైతుపండగ కార్యక్రమం సందర్భంగా తెలంగాణలో రుణమాఫీని(Loan Waivers) పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మిగిలి ఉన్న 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ నగదు అందనుంది. వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుందని తెలిపారు తుమ్మల.
‘‘రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్‌లో రైతుల కోసం రూ.47 వేల కోట్లు కేటాయించారు. అందులో ఇప్పటి వరకు రుణమాఫీకి రూ.18వేల కోట్లు, రైతుబంధుకు రూ.7,600 కోట్లు ఖర్చు పెట్టాం. రుణమాఫీ పంపిణీ విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. అందువల్లే ప్రతి రైతుకు తొలి విడతలోనే రుణమాఫీని అందించలేకపోయాం. కొందరు రైతులకు తెల్లకార్డు లేకపోవడం, బ్యాంకు, ఆధార్ కార్డుల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో 3 లక్షల మందికి రుణమాఫీ ఆగింది.
వ్యవసాయ శాఖ అధికారులు 3నెలలుగా వారందరి వివరాలు సేకరించి.. తప్పులను సరి చేశారు. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ నెల 30న మిగిలిన 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ నగదు ఖాతాల్లో జమవుతుంది. అదే విధంగా వచ్చే ఏడాది నుంచి ‘రైతు బీమా’ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని Minister Tummala వెల్లడించారు.