చైనాలో పెద్దఎత్తున నమోదవుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV Virus) కేసులు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డీపీహెచ్) డా.రవీందర్ నాయక్ శనివారం తెలిపారు. చైనాలో నమోదవుతున్న HMPV నివేదికలను చూసి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల డేటాను ఆరోగ్య శాఖ విశ్లేషించింది. గత ఏడాది డిసెంబర్ 2023తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో ఇటువంటి ఇన్‌ఫెక్షన్‌ల సంఖ్య గణనీయంగా పెరగలేదు అని రవీందర్ నాయక్(Ravindra Naik) వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MOHFW) ఆరోగ్య అధికారుల సహకారంతో HMPVపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
HMPV అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లో వంటిదే అని హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇది శీతాకాలంలో జలుబు, ఫ్లూ-వంటి లక్షణాలను కలిగిస్తుంది అని అన్నారు. కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధిని అరికట్టవచ్చని చెప్పారు. HMPV Virus ను నివారించేందుకు ప్రజలు కొన్ని ప్రికాషన్స్ పాటించాలని సూచించారు.
ముందుజాగ్రత్తలు:
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్‌తో నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.
సబ్బు, నీరు, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో తరచుగా చేతులు కడుక్కోవాలి.
ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుండి ఒక చేయి పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండాలి.
జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
పుష్కలంగా నీరు త్రాగుతూ, పౌష్టికాహారం తినాలి.
బహిరంగ గాలితో పాటు తగినంత వెంటిలేషన్ అవసరం.
ఇవి నివారించాలి:
షేక్ హ్యాండ్ ఇవ్వడం
టిష్యూ పేపర్, కర్చీఫ్ తిరిగి వాడడం
అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు
కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకడం
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం
వైద్యుడిని సంప్రదించకుండా మందులు (స్వీయ-మందులు) తీసుకోవడం.