బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్సీ దండే విఠల్(Dande Vital) ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా రూ.50,000లు జరిమానా కూడా విధించింది.
కాగా 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా దండే విఠల్ నామినేషన్ వేశారు. అయితే మరో బీఆర్ఎస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు విఠల్.. ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజేశ్వర్ నామినేషన్ ఉపసంహరణకు గురైంది. దీనిపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం విఠల్(Dande Vital) ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.