Telangana | తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీఆర్ఏల సర్దుబాటు జీవోపై హైకోర్టు స్టే విధించింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. జీవోలకు ముందున్న స్థితినే కొనసాగించాలని.. పలువురు వీఆర్ఏల పిటిషన్లపై కోర్టు మద్యంతర ఉతర్వులు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్‌ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్హత ఆధారంగా వారికి ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేసింది. వీరిలో 16,758 మంది 61 ఏండ్లలోపు వయసున్న వారు ఉన్నారు. వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే సుమారు 15 వేల పోస్టులను సైతం మంజూరు చేసింది. కలెక్టర్లు జిల్లాల వారీగా వీఆర్‌ఏల విద్యార్హత, వయసు తదితర అంశాలవారీగా జాబితాను సేకరించి, ప్రభుత్వానికి అందజేశారు. రెవెన్యూ శాఖ వారికి అలాట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నది. ఈ క్రమంలో హైకోర్టు(TS High Court) అనూహ్యంగా స్టే ఇవ్వడంతో అటు వీఆర్ఓలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం(Telangana) సందిగ్ధంలో పడింది.