రైతులకు తెలంగాణ(Telangana) వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నైరుతి రుతుపవనాలు రాక ఈ ఏడాది ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మెుదటగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. అయితే ఇప్పుడు రుతపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ(Telangana Meteorology department) అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారం రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించనుండగా.. ఆ తర్వాత తెలంగాణను కూడా తాకనున్నాయని చెప్పారు. అయితే ఈ నెల 18వ లోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అధికారులు తెలిపారు. అనంతంరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు. రుతుపవనాల ఆలస్యంతో మరోవైపు తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం సహా పలు జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.