Telangana New Secretariat |తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ఇనుమడించేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా నూతన సచివాలయం నిర్మాణం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ సుముహుర్తంలో ప్రారంభించారు. ఈ ఆధునాతన సచివాలయానికి సంబంధించిన ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
2019 జూన్ 27న నూతన సచివాలయం భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. అయితే కోర్టు కేసులు, మధ్యలో కరోనా రావడంతో సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులు 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి. 26 నెలల రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
28 ఎకరాల్లోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనం నిర్మాణం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్ తో కూడిన పాస్ లు జారీ చేశారు. 300 సీసీ కెమెరాలు, 300 మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ఇక ఆరవ అంతస్థులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. ఆయన సిబ్బందికి కూడా ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. , ప్రజాదర్బార్ నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాచేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా క్యాబినెట్ హాలునూ సిద్ధం చేశారు.
సచివాలయంలో(New Secretariat) అంతస్థుల వారీగా మంత్రుల శాఖల వివరాలు
గ్రౌండ్ ఫ్లోర్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు
1వ ఫ్లోర్: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖలు
2వ ఫ్లోర్: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖలు
3వ ఫ్లోర్: మున్సిపల్, ఐటీ, ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమం, గిరిజన, వ్యవసాయ శాఖలు
4వ ఫ్లోర్: ఫారెస్ట్, లా, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, పౌర సరఫరాలు, యువజన సర్వీసులు-సాంస్కృతిక శాఖలు
5వ ఫ్లోర్: ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలన శాఖలు
6వ ప్లోర్: సీఎం, సీఎస్, సీఎంవో ఉన్నతాధికారుల కార్యాలయాలు