Telangana SI Results | తెలంగాణలో ఎస్సై, ఏఎస్సై తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ జాబితా విడుదల చేసింది. మొత్తం 587 పోస్టులకు గాను 434 మంది పురుష అభ్యర్థులు, 153 మంది మహిళా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్ ఆఫ్ మార్కులను సోమవారం ఉదయం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలు వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు గడువు ఇచ్చింది.
Telangana SI Results | గతేడాది 587 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 2.47 లక్షల మంది ప్రిలిమ్స్ హాజరయ్యారు. అక్టోబరులో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించగా.. 46.80 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులో అర్హత సాధించినవారికి తుది పరీక్ష నిర్వహించారు. తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్ కేసులపై బోర్టు ఆరా తీయనుంది. పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్ విభాగంతో విచారణ జరిపిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వనుంది. ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు శాఖలోని వివిధ విభాగాలకు పంపించనున్నట్లు తెలుస్తోంది. ఇక పోలీస్ కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితాల విడుదలకు మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది.