KRMB | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటుందని, దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా(Rahul Bojja).. కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్(Atul Jain)కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కృష్ణ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న అక్రమ ధోరణిని వివరిస్తూ కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించారు రాహుల్ బొజ్జా.
శ్రీశైలం(Srisailam) తో పాటు నాగార్జున సాగర్(Nagarjuna Sagar) నుండి నిబంధనలను ఉల్లంఘించి తరలించుకు పోతున్న నీటిని తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. కేఆర్ఎంబీ రికార్డుల ప్రకారమే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తనకున్న హక్కులను మించి నీటిని వినియోగించుకుందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని వినియోగించుకుంటున్న అంశాన్ని 2024 నవంబర్ నుండి ప్రతినెల కేఆర్ఎంబీకి(KRMB) తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ లేఖల రూపంలో ఫిర్యాదు చేసిందని తెలిపారు.
అయినా కేఆర్ఎంబీ పట్టించుకోకుండా ఉపేక్షించడంతో ఇప్పుడు ఈ సమస్య తీవ్రతరమైందని అన్నారు. ఉమ్మడి జలాశయాల నుండి ఏకపక్షంగా నీటిని తరలించుకుని పోయే హక్కు ఆంద్రప్రదేశ్‌కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఈ ఏడాది మే చివరి నాటికి తెలంగాణకు తాగునీరు, సాగునీరు కలుపుకుని 107 టీఎంసీల నీరు అవసరం ఉందని వివరించారు. తద్వారా కృష్ణా పరివాహక ప్రాంతంలోని 13 లక్షల ఎకరాలలో వేసిన రబీ పంటలను కాపాడడంతో పాటు, కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన రెండుకోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చాలని కేఆర్ఎంబీని కోరారు.