కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి(Telangana Talli Statue) అధికారిక గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి(Shanthi Kumari) వెల్లడించారు. ఈ మేరకు అధికారిక జీవోను జారీ చేశారు. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించాలని ఈ జీవో వెల్లడించింది.
‘‘తెలంగాణ రాష్ట్ర బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని మరియు భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా “తెలంగాణతల్లి” ఉండాలని ప్రభుత్వం భావించింది. తదనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది చిత్రంలో చూపిన రూపురేఖలు కలిగిన విగ్రహాన్ని “తెలంగాణతల్లి”గా, డిసెంబరు 9వ తేదీ, 2024 నాడు ఆమోదించడమైనది’’ అని జీవో వివరించింది.
“తెలంగాణ తల్లి సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకుకంఠే, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టె చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడకతో మధ్య వయస్సు స్త్రీమూర్తిలా హుందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించబడి, కుడిచేతితో అభయాన్నిస్తూ, ఎడమచేతిలో సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలు మన ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించబడ్డాయి” అని తెలిపింది.
‘‘ఇకముందు ప్రతి సంవత్సరము డిసెంబర్ 9వ తేదీనాడు, రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణతల్లి(Telangana Talli Statue) అవతరణ ఉత్సవాన్ని” రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగినవిధంగా అధికారిక కార్యక్రమంగా జరుపుకోవాలని నిర్ణయించడమైనది’’ అని వెల్లడించింది.