TG Govt | తెలంగాణలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వాళ్ల జీతాలు పెరగనున్నాయని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంలో ఇంటరిమ్ రిలీఫ్(IR) అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేకూరుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు శుక్రవారం జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న మూలధన వేతనంపై 5శాతం ఐఆర్‌ను మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వ రంగ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను తెలంగాణ ఆర్థిక శాఖ వెల్లడించింది.
TG Govt | ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ సర్కార్ ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో నవంబర్ 14 నుంచి ఈ విజయోత్సవాలను ప్రారంభించింది ప్రభుత్వం. ఈ ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధానంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విషయంలో ఐఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.