నారాయణపేట జిల్లా మగనూర్(Maganoor) జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు(TG High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలు చనిపోతే కానీ పట్టించుకోరా? అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం అనేది చాలా సీరియస్ మ్యాటర్ అని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే మండిపడ్డారు. ‘‘వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు మరణిస్తే కానీ తప్పించుకోరా? నారాయణపేట జడ్పీ స్కూల్ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీక. పిల్లలకు పెట్టే భోజనం నాణ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు’’ అని హైకోర్టు(TG High Court) ఆక్షేపించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయమూర్తి.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.
అయితే మగనూర్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ ఘటన జరిగిన వారం రోజులు కూడా కాకముందే అదే పాఠశాలలో మళ్ళీ మరో 29 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బాధితులయ్యారు. మధ్యాహ్న భోజనం చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు ఉపాధ్యాయులు. వారిలో నలుగురు విద్యార్థులు వెంటనే కోలుకోగా మిగిలిన వారికి మరింత నాణ్యమైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.