పోలీసులు నోటీసులు జారీ చేసిన అంశంపై నటుడు మోహన్ బాబు(Mohan Babu) హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేని క్రమంలో తనకు పోలీసు విచారణ నుంచి మినహాయింపు ఇప్పించాలంటూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు.
ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. ఈరోజు విచారించి ఆయన మినహాయింపు అందించింది. ఈ క్రమంలో ఆయనకు నాలుగు రోజుల పాటు విచారణ నుంచి మినహాయింపు అందించింది. ఈ మేరకు పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు మోహన్ బాబుకు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది హైకోర్టు.
ఈ విచారణలో భాగంగా మోహన్ బాబుపై రెండు పరస్పర ఫిర్యాదులపై నమోదైన కేసులు కాకుండా మరో కేసు నమోదు చేశామని పోలీసుల తరపు న్యాయవాది వివరించారు. జర్నలిస్ట్‌పై దాడి చేసిన కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న మనోజ్ ఈరోజు విచారణకు హాజరయ్యాడని చెప్పారు.
ఈ విచారణలో భాగంగా మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీస్ పికెట్ నిర్వహించాలని మోహన్ బాబు తరపు న్యాయవాది కోరారు. పికెట్ ఏర్పాటు సాధ్యం కాదని పోలీసులు వివరించడంతో పర్తి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు(Mohan Babu) ఇంటి దగ్గరి పరిస్థితులను పరిశీలించాలంటూ న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలిచ్చింది. అనంతరం తదుపరి విచారణ డిసెంబర్ 24 వాయిదా వేసింది హైకోర్టు.